Thursday, July 2, 2009

పరిచయం

పరిచయం అన్న పదం మన నిత్య జీవితములో ప్రతి రోజూ విరివిగా వాడుతుంటాం. ఈ పరిచయాలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. రక్తసంబంధాలతో ఏర్పడే పరిచయాలు కొన్ని అయితే, కొన్ని నిత్య వ్యవహారాలలో ఏర్పడేవి.ఆత్మీయులలో కొన్ని తొలి పరిచయాలు మనకు అసలు గుర్తు ఉండకపోవచ్చు. ప్రవాహంలాంటి జీవన ప్రయాణంలో కొందరు బిందువులా కలిసి ఆత్మీయులు అని గుర్తించేనాటికి వారు మన జీవితాలలో సింధువులా మారి వుండవచ్చు. కొన్ని రైళ్ళలో పరిచయాలలా కొన్ని గంటలలో ముగిస్తే మరి కొన్ని మన జీవితాలలో ప్రభావము చూపించేవి. అయినప్పటికీ వాటిని మనం తెలుసుకోలేము. అటువంటిదే నాకు కిష్టితో ఏర్పడ్డ తొలి పరిచయము.

1976 వ సంవత్సరం లో ఆ ఉషోదయం మా చెరుకువాడ లోని పిల్లలందరికీ ఎంతో ఉత్సుకతతో మొదలైంది. ఇంచుమించుగా ౩౦ మంది వరకు మా రాజులపేట మద్యలో గల రచ్చబండ దగ్గరకు చేరారు. ఆ రచ్చ బండ మద్యలో గల పచ్చగా, ఎంతో మందికి నీడను ఇస్తూ, టీవిగా ఉండే వేప చెట్టు మా అల్లరికి సాక్షిగా నేటికీ అటు వైపు వెళితే ఆత్మీయంగా పలకరిస్తున్నట్లుగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఈనాటి లాగే ఆనాడు కుడా సంపూర్ణ సూర్య గ్రహణం కావటం, ఈ గ్రహణం గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేయటం, పెద్ద వాళ్ళు పిల్లలకు సూర్య గ్రహణాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పటమే ఆ ఆసక్తికి కారణం.

'సూర్య గ్రహణాన్ని సూటిగా చూస్తే కళ్ళు పోతాయన్టరా' అన్నాడు చిన్న ఎర్రోడు
మరి ఎం చేద్దాం' అన్నాడు ప్రసాద్
ఏది ఏమైనా సూర్య గ్రహణాన్ని చూడాల్సిందే అన్నారు అందరూ
నిజం గానే కళ్ళు పోతాయేమో అని బయం గానే ఉంది చాలా మందికి.
సూర్యుడ్ని సూటిగా చూస్తే ప్రమాదం గాని ఏదైనా నల్ల గ్లాస్ అడ్డం పెట్టుకుని చూస్తే ఏమీ కాదు' అన్నాడు కరణం గారి శ్రీను.
అవును మరి మా వూరిలో దిన పత్రిక వచ్చే కొద్ది పాటి ఇళ్ళల్లో వాళ్ళది ఒకటి. పై పెచ్చు కరణం గారంటే మా వురి రైతాంగానికి అందరకి కొద్దో గొప్పో బయం. ఎక్కడ ఏ రకమైన లిటిగేషన్ పెడతారో లాక్కోలేక పీక్కోలేక చావాలని ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉంటారు.
మా శ్రీను గాడు ఇచ్చిన సలహా అయితే అందరికి నచ్చింది. కాని అప్పటి కప్పుడు నల్ల గ్లాస్ ఎక్కడ దొరుకుతుంది. అందరం చుట్టూ చూసాము
మా వేప చెట్టు పక్కనే నర్సు ఇల్లు ఉంటుంది. నిజానికి అది మా వూరి హెల్త్ సబ్ సెంటర్, కాని మా అందరికి అలానే పిలవటం అలవాటు. అక్కడకి ANM కాపురం ఉండటానికి వసతి కూడా ఉంది కాని తను ఏదో సమయంలో రోగులకు మందులు ఇచ్చి వెళ్లి పోయేవారు.కొందరు ఆ బిల్డింగ్ కిటికీలకు ఉన్న గ్లాసును రాయితో బద్దలు కొట్టి ఆ గ్లాసు ముక్కలను పట్టుకొచ్చారు. అందరమూ తలో ముక్కా తీసుకున్నాము. తీరా చూస్తే ఆ గ్లాసు తెల్లగా ఉండటంతో సూర్యుడ్ని చూడటానికి అది ఉపయోగ పడలేదు.
అప్పుడు అన్నయ్య అన్నాడు " ఈ గ్లాసుని దీపపు మసితో ఒక ప్రక్క నల్లగా చేద్దాం అని"
ఎలా ఎలా అని అందరం ఒకటే గోల.
వెంటనే పక్కనే గల హనుమంతు ఇంట్లో నుంచి వాళ్ళ అబ్బాయి కోమటి గాడు దీపం పట్టుకొచ్చాడు.
ఆ దీపంతో అందరం గాజు ముక్కల్ని ఒక వైపు నల్లగా చేసి సూర్యుడిని చూడ సాగాము. గుండ్రంగా ఉన్న సూర్య బింబం కొద్ది కొద్దిగా ఎవరో జామ పండు తిన్నట్టుగా మాయమై పోతోంది. మా గోల అంతా వేప చెట్టు దగ్గర ఉన్న పెద్ద వాళ్ళు, యువకులు చూస్తున్నారు. అందులో నుండి సన్నగా, పొట్టిగా,నల్లగా ఉన్న ఒక కుర్రాడు నన్ను దగ్గరకు పిలిచి నా దగ్గర ఉన్న గాజుని ఒకసారి ఇమ్మన్నాడు. ఆ కుర్రాడ్ని అదే మొదటిసారి నేను చూడటం. అతను ఎక్కడో ఉండి ఇంటర్ చదువుతున్నాడట. సరే అసలు విషయానికి వద్దాం.
అలా అడగగానే ఇచ్చేయడానికి నేనేమన్నా అమాయకుడినా, ఇవ్వనంటే ఇవ్వను అన్నాను.
తను వెంటనే నాలుక మడత పెట్టి కళ్ళు ఎర్రగా చేస్తూ ఇస్తావా ఇవ్వవా అన్నాడు.
పిల్లలు చెప్పిన మాట వినకపోతే పెద్దవాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యేవారు ఆ రోజుల్లో.
" తస్సాదియ్యా దొబ్బెద్దాం అనే" అన్నాను
మరు క్షణంలో సూర్యగ్రహణం సంగతేమో గాని నక్షత్రాలు కనిపించాయి.
రెండు నిమిషాల తరువాత మాత్రమే అర్ధం అయ్యింది. గూభ గుయి మందని, ఆ కుర్రాడు గాజు ముక్కని చేతిలోనుంచి తీసుకొనే ప్రయత్నంలో ఉన్నాడని.
నేను కూడా గాజును గట్టిగా పట్టుకుంటూ " తస్సాదియ్యా......" అనటం
న్యూటన్ ప్రతి చర్యలా చెంప చెల్లుమనటం కంటిన్యూగా జరగటం మొదలైంది.
బుగ్గలు పూరీల్లా పొంగటం ఏంటో అనుభవం లోకి వచ్చింది.
పొంగిన పూరీలు జలపాతంలో తడవటం తెలుస్తోంది.
ఈ గొడవ అంతా చూసి వేండ్ర రాజు గారుగా పిలవబడే ఒక పెద్దాయన పరిగెత్తుకు వచ్చి మమ్మల్ని విడదీసేరు.
ఈ ప్రయత్నంలో పాపం ఆయనకు కూడా తృణమో పణమో బహుమానాలు అందాయి.
ఆయన అన్నారు వాళ్ళ నాన్న హేమాద్రి రాజుకి చెబుదాం ఈడి సంగతి అని.
ఆనాటి సంఘటనతో ఆ కుర్రాడు " కృష్ణ" పేరు నాకు బాగా గుర్తు ఉండి పోవటమే గాకుండా, ఆ కుర్రాడు మూర్కుడు, దుర్మార్గుడు అని మదిలో ఒక ముద్ర పడిపోయింది.
ఇదంతా ఒక గంట తరువాత టచ్ చేయటానికి కూడా ఇష్టపడని ఒక పగిలిన, మసి పట్టిన గాజు ముక్క కొరకు అంటే ఆశ్చర్యమే కాదు ఈ నాటికీ నమ్మబుద్ది కాదు. అహాలు, పట్టుదలలాంటి ఎన్నో బావాలు ఇందులో ముఖ్య పాత్ర పోషించాయని నాకు అనిపిస్తుంది.

అసలు గమ్మత్తు ఏంటంటే తరువాత రోజుల్లో ఈ రౌడీ వెధవ కోసం నేను నా ప్రాణాలకు తెగించే అంత సాహసం చేసే అంత ఆత్మీయుడు అవుతాడని గాని, నా జీవితం లోని ముఖ్య సంఘటనలలో తన ప్రమేయం ఉంటుందని గాని, తన జీవితాంతం మా బంధం కొన సాగుతుందని ఆ రోజు మాకు తెలియలేదు. అతనే నా ప్రియ నేస్తం " కిష్టి"
 

నేటివరకు విచ్చేసిన అతిధులు

Free Hit Counter