Friday, June 5, 2009

వేసవిలో ఒక రోజు

అప్పు'డే తెల్లారింది. రాత్రి రెండింటి వరకు చూసిన భారత, పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ బడలిక తీరనే లేదు. రాత్రి ఆలస్యంగా ఇంటికి రావటమే ఒక నేరమైతే, తెల్లవార్లూ క్రికెట్టు గాడిద గుడ్డు అంటూ టీవీ చూస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కాకుండా ( తన స్తిర అభిప్రాయం) మరలా ఉదయాన్నే బయలు దేరిన నన్ను చూసి 'ఎస్' అప్రసన్నంగా చూసింది. చదువులు, ఉద్యోగ, వ్యాపార జీవితములో మనిషి తనకంటూ మిగుల్చుకున్న సమయం రాత్రులే కదా! మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొవధ్ధూ ! ఏమంటారు.

ఉదయం ఆరు గంటలకే సూరయ్య గయ్యాళి భార్యతో ఆశీస్సులు తిన్నట్లు దుమదుమలాడుతూ ఇంటి నుండి బయటకు వచ్చి మండిపోతున్నాడు. మంద మారుతం మాత్రం చల్లగా శరీరాన్ని తాకుతుంటే నేను నా బైక్ పై ఇంటి నుంచి బయలుదేరి కొమ్మర వెళ్ళటానికి పాలకోడేరు పొలిమేరలు దాటేను. బీటలు ఇచ్చిన చెలకలును చూస్తూ, ఆ చేల గట్ల పై తలలు విరబూసి ఆనందముగా పలకరిస్తున్న కొబ్బరి చెట్లను చూస్తూ ప్రయాణం చేయటం మంచి అనుబూతిని ఇస్తుంది. రోహిణి కార్తి వడ గాల్పులతో ఉడికిన శరీరానికి ఈ ఉషోదయం పేదకు పెన్నిది దొరికినంత సంతోషాన్ని ఇస్తోంది. ఉద్యోగ ధర్మంలో బాగంగానే నా ప్రయాణం జరుగుతున్నా ఇంతలా మనస్సుకు నచ్చటంతో ఎంత దూరం తిరిగినా కష్టం అనిపించటం లేదు.

మోగల్లు గ్రామ రహదారులపై నా ప్రయాణం సాగుతున్నపుడు స్వాతంత్ర సమరయోదుడు అల్లూరి జన్మస్తలం ఈ ఊరే సుమా అని నా మది పదేపదే గుర్తు చేసింది. అత్యంత సాదాసీదాగా ఉన్న ఈ ఊరుని చూసినపుడు గొప్పవాళ్ళు పుట్టటం వల్ల ఊరుకి పేరు వస్తుందా లేక ఆ ఊరులో పుట్టటం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారా అని అని నాకో డౌట్. రోడ్డు పక్కన మొహాలు కడుగుతున్న కొందరు గ్రామస్తులు, టిఫిన్స్ చేస్తూ, కబురులు చెప్పుకుంటున్న జనాన్ని చూస్తుంటే వీరికి తమ ఊరికి ప్రత్యేకతను తీసుకు వచ్చిన అల్లూరి గురించి గర్వంగా ఉంటుందేమో కదా అని అనిపించింది. కాని అతని గురించి బవిష్య తరాలకు రాతలు తప్ప గురుతులు ఏవీ ఈ గ్రామంలో ఉండవనుకుంటా.అతను జన్మించిన ఇంటిని మ్యుజియంగా మార్చటం, ఆయనకు చెందిన జ్ఞాపకాలను బద్రపరచటంలాంటివి ఆశించటం అత్యాస అవుతుందేమో.

ఈడూరులో శ్రీ సూర్పరాజు గారు కట్టించిన కళ్యాణ మండపం, పార్క్, చక్కగా తవ్వించి నాపరాయి పరిపించిన చెరువు ప్రక్కనుండి వెళుతుంటే, పట్టుమని రెండువేల జనాబా లేని ఈ వూరిలో ఇన్ని సౌకార్యాలా అని మనం అచ్చెరువొంధక తప్పదు. ఇందుకొరకై ఆయన చాలా ఖర్చు పెట్టారని ప్రతీతి. బైర్రాజు ఫౌండేషన్ పుణ్యమా అని ఇలా పల్లెటూర్లు తిరిగే అవకాసం దొరకటం, సేవా భావం ఉన్న మహానీయుల్ని కలిసి వారితో పని చేయటం నా పూర్వ జన్మ సుకృతం.

కొమ్మర వాటర్ ప్లాంట్ కి వెళ్లి అక్కడి రోటీన్ వర్క్ పూర్తి చేసుకున్న తరువాత ఆపరేటర్ గోపితో మాట్లాడుతుంటే "యెన్ " నుంచి కాల్ వచ్చింది. ఈ మద్య కాలంలో తను బిజీగా ఉండటంతో ఈ కాల్ చిరకాలం తరువాత చేయటంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంతకంటే సంతోషకరమైన వార్త ఏమంటే తను ఇండియా వస్తున్నానన్న తీపి కబురు చెప్పటం. నిజానికి ఎవరైనా ఆనందంగా ఉంటే, ఆ ఆనందాన్ని పంచుకోవటం కన్నా సంతోషం ఇంకొకటి వుండదేమో!

మధ్యాహ్నం రెండింటికి కొమ్మరలో కలిసిన ప్రవీణ్తో ఇష్టాగోష్టి మాట్లాడుకుంటూ తిరుగు ప్రయాణమైనాము. వడగాల్పులకు జడిసి జనం ఇల్లు కదలక పోవటంతో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. అబ్బే ఇది ఎండకాదు వెన్నెల విహారం ఎంత బాగుందో అని మనసును మాయ చేసే ప్రయత్నం చేస్తూ, వడదెబ్బ తగిలి పడిపోకుండా ఇంటికి చేరాను. ఒక అద్బుతమైన కలను వాస్తవము చేసి, గ్రామాలను ఈ రకంగా అభివృద్ధి చేయవచ్చు అని ప్రభుత్వాలకు, తమకు ఏం కావాలో ప్రజలకు తెలియచేసిన ఫౌండేషన్ ట్రస్టీ శ్రీయుతులు రామలింగ రాజు గారికి నా నమస్సులు. అసాద్యాలను ఎన్నిటినో సుసాద్యాలను చేసిన ఈ ఫౌండేషన్ కార్యక్రమాలలో తొలి నుంచి పాలు పంచుకొనే అవకాసం దొరకటం నా అదృష్టం.
 

నేటివరకు విచ్చేసిన అతిధులు

Free Hit Counter