Saturday, November 8, 2008

పాపికొండల్లో విహారం

<
పాపికొండలు చూడడానికి బాబు ఏర్పాట్లు చేసి అక్టోబర్ నెలలో 9 వ తేదీ అని నిర్ణయించిన క్షణం మనసు వుద్వేగముతో పొంగిపోయింది. చిన్నప్పటి కల. కోస్తా పరివాహక ప్రాంతంలో లక్షల కుటుంబాలకు ప్రాణాధారంగా నిలిచి పూజలు అందుకుంటున్న తల్లి గోదావరిని పలకరించి పులకరించే సమయం. మాకు జవం జీవం ఇచ్హిన గోదావరిని ఎల్లప్పుడూ కనులముందు నిలుపుకోవాలని మా పిల్లల పేర్లు గౌతమి, మంజీర అని పెట్టుకున్నాము. గోదావరితో ఎన్నో ఎన్నెన్నో మరిచిపోని జ్ఞాపకాలు ఉన్న్నప్పటికి విశ్వనాద్, బాపు, ఆదుర్తి, వంశి, శేఖర్ వంటి భావుకుల ఊహల నుండి ప్రాణం పోసుకున్న ఎన్నో చిత్ర దృశ్యాలు కనుల ముందు కదలాడాయి. ఆనందపు గడియలు అత్మీయులుతో పంచుకోవటం మరింత సంతోషదాయకం.హైదరాబాద్ నుంచి పార్వతి గారు, ఇందిర వచ్చి మాతో కలవడంతో, మా పిల్లల కేరింతలతో, భీమవరం నుండి రాజమండ్రి కారులో చేరుకోవటంతో మా ప్రయాణం ప్రారంభమైంది.

రాత్రి ఎనిమిది గంటలకు రాజమండ్రి చేరుకొన్న మేము రివర్ బే హోటల్ లో విడిది చేసాం. అక్కడకి దగ్గరలో గల పుష్కరఘాట్లో గల శివ లింగాన్ని దర్శించుకొని మెల్లిగా నడుచుకొంటూ కోటగుమ్మం సెంటర్ లో షాపింగ్ చేసుకొని తిరిగి హోటల్ చేరుకొన్నాం. ఆ రోజు శరన్నవరాత్రులలో బాగంగా దుర్గమ్మ తల్లి తెప్పోత్సవం దేదీప్యమానంగా అలంకరించి గోదావరిలో ఉరేగింపుగా రాగా కన్నుల పండుగగా తిలకించాం.

ఉదయాన్నే లేచి రేవుకి చేరుకునేసరికి వైజాగ్ నుంచి బాబు, పద్మ, హర్ష, తేజలతో పాటు బాబు స్నేహితుల కుటుంబాలతో సహా లాంచిలో రెడీగా ఉన్నారు. అందరూ చేరుకున్నాక ఉదయం నాలుగింటికి లాంచి సన్నటి వెన్నెల వెలుగులో నీటిని చీల్చుకొంటూ బద్రాద్రి వైపు తన ప్రయాణం ప్రారంబించింది. చాలా మంది వీచే చలిగాలికి తట్టుకోలేక లోపలి గదులలో విశ్రమించగా ఉత్శాహవంతులైన మరికొందరితో పాటు నేను, శాంతి, బాబు, పార్వతి గారు, ఇందు, పిల్లలు అంతా లాంచి పై బాగానికి చేరి కబుర్లలో పడ్డాం. పై బాగంలో ఉంటేనే గోదావరి రమణీయతను చూసే అదృష్టం ఎక్కువగా ఉంటుందని మాకు తొందరగానే తెలిసివచ్చింది. అందుకే మా రెండు రోజుల ప్రయాణములో మా ఆవాసం ఆ ప్రాంతమే కావటం ఆశర్యకరం కాదు. సాగరంలా ఉన్న ఆ నీటి తరగల పై నుండి వచ్చే శీతల పవనాలు అందరిని గజ గజ వణికిస్తుంటే , తొలి వేకువరేఖలు చూసే అదృష్టం కలిగినందుకు మనసు మురిసింది. ఈ క్షణాల్ని మనసు పొరలలో పదిలపరుచుకుంటూ అదే సమయములో కెమెరా కన్నులలో బద్రపరుచుకున్నాం.

గట్టుపై పొలాల్లోకి వెళ్ళే పల్లె ప్రజల పరుగులు , ఉషోదయపు ఆనంద సమయాన ఎగిరిపడే మీనాలు, గోదావరి మధ్యలోని లంకలు, రెళ్ళు పొదలు, బంగారంలా మెరిసే ఇసుక తిన్నెలు, జాలరుల తెరచాప పడవలు, సూర్యుని తొలి పలకరింపుతో గోదావరి నిద్ర లేచింది. కాలం ఆగిన క్షణాలు.

జనారణ్యం నుంచి దూరంగా వచ్చి తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని పరితపించే ప్రేమికుల జంటలా గట్టుపై నిలిచిన రెండు వృక్షాలు నదిలో సాగే ప్రయాణికులును పలకరిస్తున్నట్లుగా నిలిచాయి.

గ్యాస్ లైన్ కోసం గోదావరిపై రెండు గోదావరి జిల్లాలను కలుపుతూ వేసిన వంతెనను దాటుకుంటూ గోదావరి నదిగర్భంలో కన్నుల పండుగ చేస్తున్న పుణ్య క్షేత్రం పట్టిసీమ ప్రాంతం చేరుకున్నాం, ప్రయాణం ప్రారంభించి మూడు గంటలు అయినా మూడు నిమిషాల్లా గడిచింది.

అక్కడికి దగ్గరలోనే ఉంది కొత్తగా మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్ట్. పోలవరం దగ్గర ఆనకట్ట కట్టిన తరువాత కలిగే ప్రయోజనాల గురించి కొందరు మాట్లాడితే, మరికొందరు ఆ కట్టడం పూర్తి అయిన తరవాత కోస్తా మరియు గిరిజనుల జీవితాలు ఎన్నిరకాలుగా మార్పులు చెందవచ్చో సోదాహరణంగా తెలియచేసారు. ఆ నిర్మాణం తీరుతెన్నులు చూసాక ఇది పూర్తి కావటానికి చాల కాలం పడుతుంది అనిపించింది.
శ్రీనివాస్ ( మేము ప్రయాణించిన బోటు పేరు) లో మా ప్రయాణం మలి మజిలిలో బాగంగా దేవీపట్నం దగ్గర చెకింగ్ కోసం ( ప్రయాణీకుల వివరాలు, నిషిద్ద వస్తువులు ఎవైనా ఉన్నాయేమో అని చూస్తారు) ఆగింది. అక్కడే ఉన్న ఒక పాత కట్టడం అలనాటి పోలీస్ స్టేషన్ అని, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామ రాజు తొలిసారిగా బ్రిటిష్ వారి మీద దండయాత్రని ఈ పోలీస్ స్టేషన్ ముట్టడితోనే ప్రారంభించాడని స్థానికులు చెప్పారు.

నది మధ్యలో కట్టిన విధ్యుత్ టవర్స్, తూర్పు గోదావరి వైపు నిర్మించిన లిఫ్ట్ ఇర్రిగేషన్ పంప్ హౌస్ ను చూస్తూ ముందుకు సాగిన మేము ,ఈశ్వరాలయం ( జానకి రాముడి సినిమా షూటింగ్ ఇక్కడ జరగడం వలన జానకి రాముడి గుడి అని స్థానికులుచే పిలవబడుతోంది) సమీపంలో గల ఇసుకతిన్నెల వద్ద ప్రాతకాల కార్యక్రమాల కోసం బోటు ఆపాడు. సన్నటి ఇసుకతోను, రెళ్ళు దుబ్బులతోను ఉన్న ఆ లంకను చూడగానే అందరు పెల్లుబుకిన ఆనందముతో పరుగులు పెట్టారు. ఆనందపు పొంగు చల్లారి చుట్టూ పరిశీలించిన తరువాత అనిపించింది, 'ప్రకృతిని నాశనం చేయడం లోను, కల్మష పూరితం చేయడం లోనూ మన వాళ్ళను మించిన వాళ్ళు ప్రపంచంలో వుండరేమో' అని "చలం" తన మ్యూజింగ్స్ లో చెప్పినది మదిలో మెదిలింది. ప్రభుత్వాలు ఈ విషయములో జాగ్రత్తలు తీసుకోవలిసిన అవసరం ఎంత అయినా వుంది. దానికి ప్రయాణికులు సహకారం కూడా ఉన్నప్పుడు మాత్రమే ఇంత అద్బుతమైన ప్రకృతిని కాపాడుకోగలం.

ప్రయాణం ముందుకు సాగేకోద్దీ గోదావరమ్మ తన వన్నె చిన్నెలు చూపించడం ప్రారంభించింది. ఏటి గట్టు అనేదే లేకుండా ఆ స్థానంలో కొండలు, వాటిపై దట్టముగా పెరిగిన అడవులు, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరిరాజుకి అతిధిగా వేంచేసిన మేఘాలు, ఎగిరే పక్షుల గుంపులు, అక్కడక్కడ జాలువారే జలపాతాలు, వీటితో పాటు మేము కూడా ప్రకృతి బిడ్డలమే అన్నట్టు గిరిజనుల నివాసాలు కన్నుల కింపుగా ఉంది. ఇరుఒడ్డుల మద్య దూరం అర కిలోమీటరు కూడా ఉండదేమో అనిపిస్తోంది. రాజమండ్రి వద్ద ఆవలి గట్టు కనిపించంత విశాలంగా ప్రవహించే నది ఇదేనా అన్పించింది. పాపికొండల ప్రాంతం చేరువ అయ్యేసరికి గోదావరి నదిలా కాక ఒక పెద్ద సరస్సులా ఉంది. తన ప్రయాణ మార్గం చెప్పటం కూడా కష్టం అయింది. దాంతో పార్వతి గారు, శాంతి, పిల్లలు, నేను ఎటు వైపు వెళతాము అన్నదానిపై సరదాగా పందేలు వేసుకున్నాము. ఎవరూ ఏక పక్షముగా నెగ్గలేకపోయాము.ఒక గట్టు నుండి రెండో వైపు చూస్తే ఒక చెరువుకి మిగిలిన అన్ని దిక్కులలోను గట్లు ఎలా కనిపిస్తాయో, ఎదుట కనిపించే గోదావరి కూడా అలా వృత్తాకారంలో ఇసుకతో మెరిసే గట్లు కలిగి వుండి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక్కడ నది ప్రవాహ వేగం పరిమితముగా వుంది, ఈ ప్రాంతమే అత్యంత లోతైన ప్రాంతం.150 అడుగుల లోతు నుండి 250 అడుగుల లోతు వరకు కూడా వుంటుంది. ఇంత మనోహరమైన అందాలు చూస్తూ, పాపికొండల మద్యలో గల కాటేజీలు ప్రక్కగా ప్రవహించే వాగును చూస్తూ, ఇంత అందమైన ప్రదేశములో పూర్తిగా ఒక రాత్రి ఉన్న చందుని గుర్తు చేసుకొంటూ మేము మద్యాహ్నం ఒంటి గంటకల్లా పేరంటాలపల్లి చేరాము.

ఒడ్డునే ఒక పెద్ద మద్ది వృక్షం మాకు ఆహ్వానం పలికింది. పైన రామకృష్ణ మఠం వారిచే నెల కొల్పబడిన ఒక ఈశ్వరఆలయం ఉంది. ఇక్కడ పూజారులు ఎవరూ వుండరు. అన్ని చోట్లా డబ్బుల కోసం ఆశిస్తుంటే, ఇక్కడ మాత్రం ప్రశాంతతను బంగం చేయవద్దు అని చెపుతారు.

గుడికి చేరే దారిలో కొంత మంది గిరిజనులు వెదురుతో చేసిన కళారూపాలు అమ్మి జీవనం సాగిస్తున్నారు. కొండపై నుంచి వచ్చే జలపాతం లో అందరూ కాళ్ళు చేతులు కడుగుకొని గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చాము.

ఇక్కడికి తక్కువ దూరంలోనే నది ఒడ్డునే లాంచి వాళ్లు నిర్దిష్టమైన సమయానికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేసారు.మా ఈ రెండు రోజుల ప్రయాణం లో సమయ పాలనతో, మంచి ఆహరం అందించి బోటు వాళ్లు అందరి మన్ననలు పొందారు. కొంత విశ్రాంతి తరువాత మా ప్రయాణం బద్రాద్రి వైపు నిరంతరాయంగా సాగింది. పోలవరం నుండి పాపికొండలు వైపు ప్రయాణం చేసినపుడు కొండలు,అడవులు ఎంత ఎత్తుగా, దట్టంగా పెరుగుతో వచ్చాయో, నది వైశాల్యం తగ్గుతో వచ్చిందో,పేరంటాలపల్లి నుండి బద్రాద్రి వెళ్ళే కొద్దీ అడవులు, కొండలు తగ్గుతూ వచ్చాయి, నది వైశాల్యం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. నది లోని నీళ్లు మాత్రం బాగా తగ్గాయి. కాని చాల స్వచ్చంగా, నిర్మలంగా వున్నాయి. అందరూ స్నానాలు చేస్తామని ఉత్సాహపడటంతో శ్రీరామగిరి రేవుకి కనుచూపు దూరంలో ఒక ఇసుక లంక దగ్గర బోటు నిలిపాడు. అందరూ జలకాలాటలలో మునిగి తేలి అలసి పోయారు. నీళ్లు తక్కువగా వుండటం వలన శ్రీరామగిరి రేవు దగ్గర దిగి బస్ లో మేము బద్రాద్రికి బయలుదేరాము. బస్ ప్రయాణం సుదీర్ఘంగా సాగి విసుగు తెప్పించింది. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభించిన మా ప్రయాణం సాయంత్రం అయిదు గంటల వరకు బోటు, అక్కడ నుండి రెండున్నర గంటల బస్ ప్రయాణంతో పూర్తి అయింది. మా వూరినుండి వచ్చి ఇక్కడ స్తిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రసాద్ గారు మాకు వసతి ఏర్పాటులో తోడ్పాటు అందించారు. రాత్రి ఎనిమిది గంటలకు బద్రాద్రి లోని సత్రంలో విశ్రమించిన తరువాత , అప్పటి వరకు వున్న ఉత్సాహం స్థానంలో, అలసట ఆవహించి టిఫిన్ కి వెళ్ళకుండా నిద్ర పోయాను. పిల్లలు ( ఇందు, మంజు, గౌతమి) వచ్చి టిఫిన్ తింటే కాని కుదరదు అంటూ నిద్ర లేపి తినేవరకూ దగ్గర కూర్చున్నారు.
ఉదయం 5 గంటలకే అందరూ సీతారాముల దర్శనానికి వెళ్ళాము. సీతారాముల అన్యోన్యానికి నిదర్శనంగా అమ్మవారు అయ్యవారి వొడిలో ఆసీనులై ఉంటారు. ఈ రకంగా మరే ఇతర ఆలయములోను ఉండదని అన్నారు. మహానుబావుడు బద్రుడి శిఖరబాగం కూడా మనం గుడిలో చూడవచ్చు. దర్శనం తరువాత అందరూ తిరిగి సత్రంకి వచ్చేసాం. సత్రం పై బాగానికి వెళ్లి చుస్తే పక్కనే గల గోదావరి ఇసుక మేటలు వేసి, తక్కువ నీటితో సేలయేరులా కనిపిస్తోంది.తను వుగ్ర రూపం ధాల్చినపుడు ఈ బద్రాద్రి పరిసర ప్రాంతాల్ని గడగడలాడించి, రామయ్యను చూసిన తరువాత చల్లబడే నదీమతల్లి తనేనా అనిపించేటంత ప్రశాంతంగా వుంది.

బస్ లో శ్రీరామగిరి రేవుకి చేరుకొని , అందరూ మంచి మూడ్ తో ఉండటంతో నవ్వులతో కేరింతలతో రాజమండ్రికి తిరుగు ప్రయాణం మొదలైంది. నిన్న చూసిన సుందర దృశ్యాలే అయినా అదే తాజాదనం, అదే అనుభూతి. గండి పోసమ్మ గుడికి చేరుకుని అమ్మ వారి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి పట్టిసీమ క్షేత్రం చేరుకునేసరికి సమయం సాయంత్రం 5 గం అయింది. సూర్యాస్తమయము కావడంతో నీరెండ వెలుగులతో, బంగారు రంగులో మెరుస్తున్న పరిసర ప్రాంతాలు, ఈ పుణ్య క్షేత్రానికి ఒక వింత శోభను చేకూరుస్తున్నాయి. జలకాలాటలు రుచి మరిగిన నగర వాసులు గోదారి స్నానాలు అంటూ వొడ్డునే ఆగిపోయారు.
ఈ గుడి అత్యంత పురాతనమైనది. దక్ష యజ్ఞం బంగం చేయడానికి వచ్చిన వీరబద్రేస్వరుడు మరియు సీతారాములు కొలువై వున్న క్షేత్రము. ఈశ్వరుడు కొప్పు కలిగివుండి , దక్ష సంహారానికి వినియోగించిన పట్టిసం అనే ఆయుధం ఇక్కడ పడటం వలన ఈ ప్రదేశానికి పట్టి సీమ అనే పేరు వచ్చింది అనియు, గౌతమ మహర్షి తన పుత్రిక గౌతమితో ఈ క్షేత్రం దర్శనానికి వచ్చి ప్రదక్షిణం చేయుట వలన, ఈ క్షేత్రం చుట్టూ గోదావరి మడుగు కట్టిందని ప్రతీతి. ఇంకొక విశేషం ఏంటంటే గోదావరి పుట్టుకకు మునుపే ఈ క్షేత్రం వుందని కూడా అంటారు. స్థల పురాణం ప్రకారం గజేంద్రుని శ్రీ హరి రక్షించిన ప్రాంతం ఇదే అని అంటారు. ఇంతటి చారిత్రిక, పౌరాణిక ప్రాముఖ్యం కలిగి వున్నా ఈ స్వామి దర్సన బాగ్యం ఇన్నాళ్ళకి లభ్యం అయిందని అనేకులు సంతసించారు.చీకటి కమ్మిన వేళ, మేము మలి మజిలి వైపు కదిలాము.

తొందరలోనే మీకు నేను సాయం అంటూ చంద్రుడు మాకు తోడు వచ్చి మబ్బుల మాటు నుండి మమ్మలిని పలకరించాడు. అందరం ఆనందాన్ని మరింత పెంచుకోవాలంటూ అంత్యాక్షరి మొదలు పెట్టాము. నేను, ఇందు, గౌతమీ, మంజు, పద్మ ఒక జట్టుగా, బాబు, శాంతి, పార్వతి గారు, హర్ష, తేజ ఇంకొక జట్టుగా ఏర్పడి మొదలు పెట్టిన ఈ ఆటతో, గోదావరి మా అల్లరితో, నవ్వులతో ప్రతిధ్వనించింది.కొంత దూరం వెళ్ళేటప్పటికి నిర్మల ఆకాశం నుండి జాబిల్లి తన కాంతులతో గోదావరిని ప్రకాశింప చేయసాగేడు. " గోదారమ్మ, వెన్నెట్లో గోదారమ్మ" ప్రవహించే నీటి తరంగాలపై మెరిసే మెరుపులు, సడి చేసే చల్లని గాలులు, చీకట్లోకి చొరవగా చొచ్చుకు వెళ్ళే లాంచి చేసే శబ్దాలు లయ బద్దంగా వినిపిస్తుంటే, పల్లెలలోని దీపాల కాంతులు తోరణాలుగా కనిపిస్తుంటే, మా భావావేశాన్ని మరింత పెంచుతూ గోదావరి మద్యలో ఒక ఇసుక తిన్నె వద్ద లంగరు వేసి బోజనాలు ఏర్పాటు చేసిన లాంచి సిబ్బందికి, ఇంత చక్కటి ప్రయాణపు ఏర్పాట్లు చేసిన బాబుకి మా కృతజ్ఞతలు. అలా నిశి లోకి చూస్తూ మైమరిచినపుడు, " ప్రకృతిని ఇష్టపడేవాల్లని చాలా మందిని చూసాను గాని, ఇంతగా మైమరచిపోయే వాళ్ళని ఎవరినీ చూడలేదన్న'' ఇందు మాటలు చిరకాలం గుర్తుంటాయి. రాత్రి విందు పూర్తి అయిన ఇరువది నిమిషాలలోనే రాజమండ్రి రేవుకి తొమ్మిది గంటలకి చేరుకొన్నాము.
జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాల్ని మిగిల్చిన ఈ ప్రయాణం, అపుడే ముగిసిందన్న దిగులుతో వెనుతిరిగి రేవువైపు చూస్తే చెత్తా చెదారాలతో, మురికి కాలవలనుండి వచ్చే మలినాలతో, భరించరాని దుర్గందంతో గోదావరి కన్నీరు పెట్టినట్లుగా అనిపించింది. తోటి మనుషుల్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయని మనం, ప్రకృతి చేసే దీనాలాపాన్ని ఏనాటికైనా వినగలమా?

Friday, November 7, 2008

భాష్పం


పదే పదే తొంగి చుస్తావెందుకమ్మా
నా గుండె మంటలు చల్లార్చేందుకా
గోదారి వరదలా పొంగి పోర్లుతావెందుకమ్మా
నలుగురిలో నవ్వుల పాలు చేసేందుకా
కను రెప్పల తడిని కనపడనీయకే
కదిలి పోయే ప్రియ నేస్తం కొరకు

ఎదురు చూపులు

చిన్ననాటి ముచ్చట్లు పంచుకున్న బాల్య మిత్రులు ,
ఆట పాటలలో చేయి కలిపిన నేస్తాలు
పలక బలపాలతో తొలి అడుగులు వేసిన సహచరులు
తోటలలో మాలికి దొరకని పరుగులు
చెరువులలో కొట్టిన ఈతలు
పంచుకున్న మామిళ్ళు
భోగి మంటల సంబరాలు
పసిడి పంటల సొగసులు
చిలుక ద్వాదశి నాటి ప్రసాదాలుకై పోటీలు
అన్నిటిలోనూ తోడు నిలిచిన స్నేహితులు
జీవన గమనంలో పెరిగిన దూరాలు
కాలమనే కడలిలో కరిగిన స్నేహాలు
తొలకరి కై నిరీక్షించిన మల్లె లా
వసంతం కొరకు వేచిన కొయిలలా
ఉషస్సుకై ఎదురు చూసే కలువలా
అలనాటి అత్మియతలకై నిరంతరం నా ఎదురుచూపులు

Monday, September 8, 2008

నేటి ముచ్చట్లు

నా మనసుకి నచ్చిన భావాలు గుది గుచ్చి ఒక చోట ప్రోగు చేసుకోవాలని అనిపించినపుడు నేను కూడా ఒక బ్లాగ్ లో వ్రాసుకుంటే బాగుంటుందని అనిపించింది.
 

నేటివరకు విచ్చేసిన అతిధులు

Free Hit Counter