Monday, February 23, 2009

అమ్మమ్మ

నా బాల్యంలో నేను అమ్మమ్మగారింట పెరిగాను. ఆ సమయంలో అమ్మా వాళ్లు అన్నవరంలో మా తాతయ్య అంటే మా నాన్న గారి పెదనాన్న వాళ్ల దగ్గర వుండేవాళ్ళు. చిన్నప్పుడు నేను అల్లరి చాల ఎక్కువ చేసేవాడిని అని , అందువలన అమ్మకు నన్ను చూసుకోవడం కష్టంగా ఉండటం, అంతేకాక నేను అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని మారాం చేయడంతో,( ఎందుకు చేయనూ, ఎంత అల్లరి చేసినా , ఎంత విసిగించినా ఎమీ అనేవారు కాదు) చెరుకువాడలోనే ఉండి అమ్మమ్మ దగ్గర మన ఇష్టారాజ్యంగా పెరిగాను. ఎంత అల్లరి చేసినా అంత సహనంతో, చిరునవ్వుతో ఉండే వారిని నా జీవితంలో ఇంతవరకు ఇంకొకరిని చూడలేదంటే అతిశయోక్తి కాదు.
వసంతం తరువాత గ్రీష్మం వచ్చినట్లే నాకు ఆరేళ్ళ వయస్సులో, అమ్మా వాళ్ళు కూడా చెరుకువాడ వచ్చి స్థిరపడటంతో నా ఎల్లలు లేని అల్లరికి, ఆనందానికి సరిహద్దులేర్పడ్డాయి. ఏంచేస్తాం అందరిలానే నేను కూడా స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితం అయిన నాకు, కొత్త ప్రపంచపు ద్వారాలు తెరిచినట్లయింది. ఆనాటి సహచరులే దండు శంకరం, కరణం గారి శ్రీను , సన్నిధి సత్యనారాయణ, బెజవాడ మాస్టారు గారి అబ్బాయి బాలాజీ, మొదలయిన కొత్త స్నేహితులు అత్మీయులయ్యారు. అగ్నికి వాయువు తోడైనట్లు మా అల్లరికి పట్టపగ్గాలు లేకుండా పోవటంతో అమ్మా నాన్న కంగారుపడి నాకు క్రమశిక్షణ నేర్పాలని ప్రయత్నించటంతో, అమ్మమ్మ నాకు రక్షణగా వచ్చారు. అయినా పట్టిన పట్టు విడవకుండా నాన్న నను శ్రీ వెంకటేశ్వర కాన్వెంటు ఆకివీడులో జాయిన్ చేసారు. అక్కడ ఎందుకు వచ్చేవో తెలియదు గాని , గోదావరి వెల్లువలా మార్కులు వచ్చి క్లాసులో మొదటి రాంక్ వచ్చేసింది.ఆ ఒక్క పర్యాయం ఎందుకో అలా జరిగిపోయింది మరి. అక్కడ నాకు పోటీదారు , స్నేహితురాలు అయిన సుశీల అనే అమ్మాయికి , నాకు తరగతి నాయకత్వం అప్పగించారు.బెరుకు తగ్గటం, కొత్తగా వచ్చిన హోదా వల్లనో ఏమో మరి, మన అల్లరి మరింతగా పెరగటంతో గిట్టని వాళ్లు ఈ వార్త మా నాన్నకి ఉప్పందించటంతో ఆయన నన్ను మరల మా ఊరి స్కూల్లో చేర్పించటంతో హాయిగా వూపిరి పీల్చుకొన్నా.
చిన్న కొడుకు కావటం వల్ల అనుకుంటా తమ్ముడు అమ్మకు ఎక్కువ చేరువగా ఉండటం, నేను అమ్మమ్మకి దత్తుడ్ని కావటంతో , పెద్ద కొడుకుగా అన్నయ్య , నాన్న వాటాకు వచ్చాడు. ఈ వాటాలు గందరగోళం ఏంటంటే ఇంట్లో అమ్మ మేము తినటం కోసం రకరకాలయిన స్వీట్స్, చేగోడీలు, జంతికలు లాంటివి చేసేవారు. ఒకరు ఎక్కువ తిన్నారని, ఒకరివి ఇంకొకరు తిన్నారని అస్తమాను గొడవలు పడిపోయేవాళ్ళం. ఈ గొడవలు తీర్చలేక ఇంట్లో ఉన్నా ఆరుగురుకి వాటాలు వేసేవారు. అమ్మ వాటాకి వచ్చినవి తమ్ముడు, అమ్మమ్మ వాటాకి వచ్చినవి నావి అని మా నమ్మకం, పాపం నాన్న ఇంట్లో ఎక్కువగా ఉండరు కాబట్టి అన్నయ్యకి నష్టం అని ( ఒక వాటా కాబట్టి) మేము అనేవాళ్ళం. వాడు నవ్వే వాడు. మాకు తరువాతి కాలంలో తెలిసింది మాకంటే అన్నయ్యకే ఎక్కువ వాటా వస్తోందని. అది ఎలా సాధ్యం అయిందో నాకు ఇప్పటికీ తెలియలేదు.

అమ్మమ్మ నాకు ఇచ్చిన కొత్త రెండు రూపాయల నోట్లు కట్ట ఒకటి నా దగ్గర ఇప్పటికి బద్రంగా వుంది, అలాగే మరి కొన్ని పది రూపాయలు కూడా తనని పదే పదే గుర్తు చేస్తూ పదిలంగా వున్నాయి.
పగలు స్కూల్స్ కి వెళ్ళాల్సి రావడంతో మా ఆటలు సెలవు రోజులకి, రాత్రులకి విజయవంతంగా మార్పు చేసుకోవటం జరిగింది. ఆ రోజుల్లో మిగిలిన పల్లె జనంలా మేము కూడా ఎక్కువగా రాత్రి వేళలో ఆరు బయట పడుకునే వాళ్ళం. అందువలన అర్ధ రాత్రుల వరకు ఆడుకుని వచ్చి చప్పుడు కాకుండా గుట్టుగా మంచం ఎక్కి దుప్పటి ముసుగు తన్నేవాళ్ళం. ఆలస్యంగా వస్తున్నామని అమ్మా వాళ్ళకు తెలుసు కాని కొన్ని సార్లు తెల్లవార్లూ ఆడుకుని వస్తున్నామని అమ్మా వాళ్ళకు తెలియదనే మా నమ్మకం. అమ్మమ్మని మేము మాయ చేయలేక పోయేవాళ్ళం. మేము వచ్చేవరకు ఎదురు చూసి మృదువుగా మందలిస్తూ జాగ్రత్తలు చెప్పే వారు.
తనకి నా మీద ఉన్న ప్రేమ నా వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. తనకి అత్తింటి వాటాగా వచ్చిన అర ఎకరం పొలం నాకే ఇస్తానని, తన శేష జీవితం నా దగ్గరే వుంటానని అనేవారు. నేను కూడా గొప్పగా అందరితో అమ్మమ్మ నేను ఎప్పటికీ కలిసే వుంటామని చెప్పేవాడిని. చక్కటి వర్చస్సుతో, సన్నగా, తెల్లటి చీరలో ఎప్పుడూ నవ్వుతూ వుండే అమ్మమ్మకి ఆయాసం ఎక్కువ అయింది. భీమవరంలో వైద్య చికిత్స్య చేయించుకొనేవారు.

ఆవిడకు ఆద్యత్మన చింతన ఎక్కువ. ఒంటి పూట భోజనం చేస్తూ సత్సంగం చేసేవారు. ఈ సత్సంగం ఒక్క ముఖ్య కేంద్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా దగ్గర దయాలబాగ్ లో ఉండేది. మిగిలిన భక్తులతో పాటు అప్పుడప్పుడు ( సంవత్సరంలో ఒక పర్యాయం ఉండేదేమో) వెళ్లి వస్తూ ఉండేవారు. అక్కడినుండి వచ్చేటప్పుడు ప్రసాదాలు తెచ్చేవారు. అందులో ఒక స్వీట్ నాకు చాలా ఇష్టంగా వుండేది. అది బూడిద గుమ్మడి కాయతో చేస్తారని తెలిసినపుడు మా ఆశ్చర్యం వర్ణనాతీతం. ఎందుకంటే బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటలు కాని వడియాలు కానీ నేను ఏవీ తినేవాడిని కాదు.

శీత గాలులుతో వణికిస్తున్న డిసెంబర్ మాసం. బంగాళాకాతంలో అల్పపీడనం పట్టడంతో చలి మరీ ఇబ్బంది పెడుతోంది. సన్నగా తుంపరతో 14వ తేది తెల్లవారింది. ఆ రాత్రి చలితో బాధపడ్డ అమ్మమ్మ, వేకువనే లేచే అమ్మమ్మ ఇంకా నిద్ర లేవలేదు. తనని ఎవరూ నిద్ర లేపవద్దని అమ్మ గట్టిగా చెప్పడంతో ఉదయం తొమ్మిది గంటల వరకు ఎవరూ తనని నిద్ర లేపలేదు. అప్పటికి కూడా తను నిద్ర లేవక పోవటంతో లేపటానికి ప్రయత్నం చేసిన అమ్మకి తన తల్లి పార్థివ శరీరం చల్లగా తగిలింది. అప్పటికి కాని మాకు అర్ధం కాలేదు. అమ్మమ్మ మా అందరి దగ్గర శాశ్వతముగా శలవు తీసుకుందని, నిద్రలోనే ప్రశాంతముగా మమ్మలిని వీడిపోయిందని. మా మనసులు తెలిసినట్లుగా ప్రకృతి జడి వానతో మమ్మలిని ముంచెత్తింది.
 

నేటివరకు విచ్చేసిన అతిధులు

Free Hit Counter